
కావలసిన పదార్ధాలు :
శనగ పప్పు : అర కిలో
బెల్లం: అర కిలో
మైదా : అర కిలో
యాలకులు : అయిదు లేక ఆరు
నెయ్యి : బొబ్బట్లు కాల్చుకోడానికి తగినంత
నూనె : వంద గ్రాములు
తయారు చేసే విధానం :
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి.
మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా బొబ్బట్లు వస్తాయి.
ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి.
పప్పు చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.
రుబ్బిన పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .
ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి మద్యలో పెట్టాలి.
ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి.
ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.
అలా వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.
మిగిలిన పూర్ణం కూడా పైన చేసిన విధంగా చేసుకోవాలి.
బొబ్బట్లు రెడీ అయినట్టే మరి .......
రంగోలి రోటి

కావలసిన పదార్ధాలు :
మైదా : అర కిలో
పాలకూర : మూడు కట్టలు
టమాటాలు : నాలుగు పెద్దవి
పచ్చి మిర్చి : నాలుగు
జీలకర్ర పొడి : ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూను
కారం: అర టీ స్పూను
ఉప్పు : రుచికి తగినంత
నూనె : మూడు టబుల్ స్పూన్లు
తయారు చేసే విధానము:
ముందుగా పాలకూర ఆకులు తీసుకొని బాగా కడుగుకోవాలి. ఒక గిన్నెలో నీరు పోసి అందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. పాలకూర ఉడికాక నీటిలో నుండి తీసేసి చల్లార నివ్వాలి. ఇప్పుడు మిక్సీ జారులో పాలకూర , పచ్చిమిర్చి , జీలకర్ర పొడి మరియు సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాలకూర్ ముద్దను పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు టమాటాలను తీసుకొని మళ్ళీ వేడి నీటిలో వేసి పాలకూరని ఉదికిన్చినట్టే ఉడికించాలి. టమాటాలు ఉడికాక నీటి నుండి తీసి చల్లార బెట్టాలి. చల్లారాక టమాటాకి ఉన్న తొక్కని తీసెయ్యాలి. ఆ టమాటాలను మిక్సీ లో వేసి కొంచెం కారం , అల్లం వెల్లుల్లి ముద్ద మరియు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో సగం మైదా పిండి అంటే పావు కిలో తీసుకొని అందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర ముద్దని వేసి అవసరం అనుకుంటే కొంచెం నీరు పోసి రెండు టీ స్పూన్ల నూనె వేసి చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. అలా తయారు అయిన పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
మిగిలిన మైదా పిండిలో మనం తయారుగా పెట్టుకున్న టమాటా ముద్దను కలిపి కొంచెం నూనె కొంచెం నీరు పోసి మళ్ళీ ఇందాకటి లాగే చపాతీ పిండిలాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒకొక్క పిండి ముద్దను తీసుకొని విడివిడిగా పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి .
కొంచెం మందంగా వత్తుకోవాలి. ఆకుపచ్చ చపాతీ మీద ఎర్ర చపాతీ పెట్టి రెండు కలిపి ఆ ముక్కలను. తరువాత చాకుతో అడ్డంగా ముక్కలుగా కోసుకోవాలి.
నిలువుగా ఉన్నా ముక్కను అడ్డంగా తిప్పితే ఇలా ఉంటుంది.
ఒకొక్క ముక్కను తీసుకొని చపాతీ లాగ వత్తుకోవాలి.
అంతే రంగోలి రోటి రెడీ.....మీకు నచ్చిన కూరతో కలిపి లాగించేయ్యడమే మరి .....
నేను ఈ వంటకాన్ని ఈనాడు ఆదివారం పుస్తకంలో చూసి ట్రై చేశాను బాగా కుదిరాయి....మీరు కూడా ట్రై చెయ్యండి మరి.....
సేమ్యా ఉప్మా

కావలసిన పదార్ధాలు:
సేమ్యా : అర కిలో
బంగాళా దుంపలు ( ఆలు) : రెండు , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు : ఒకటి పెద్దది , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి
పల్లీలు : గుప్పెడు
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెబ్బ
పోపు సామాను: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు
నూనె: మూడు టబుల్ స్పూన్లు
నీరు : లీటరు
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేసే విధానము :
ముందుగా గాస్ మీద ఒక బాణీ పెట్టి అది వేడి అయ్యాక అందులో ఒక టబుల్ స్పూన్ నూనె పోసి నూనె కాగాక అందులో సేమ్యా వేసి కొంచెం వేయించుకోవాలి ( పచ్చి వాసన రాకుండా కొంచెం వేయించాలి, అంతే ) . సేమ్యా బంగారు రంగు రాకుండానే దింపెయ్యాలి. అలా వేయించిన సేమ్యా ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ గాస్ మీద బాణీ పెట్టుకొని బాణీ కాగాక అందులో రెండు టబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పల్లీలు, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేగ నివ్వాలి. ఇప్పుడు అందులో బంగాల దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక లీటరు నీరు పోసుకోవాలి. ఒక గ్లాసు సేమ్యకి రెండు గ్లాసుల నీళ్లు అన్నమాట. నీరు పోసాక బాణీ పై మూత పెట్టి నీరు మరగానివ్వాలి.
నీరు మరుగుతూ ఉండగా అందులో ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా ని ఆ నీటిలో వేసి బాగా కలిపి గాస్ మంట తగ్గించి మళ్ళీ మూత పెట్టెయ్యాలి. మద్య మద్య లో మూత తీసి కదుపుతూ ఉండాలి. నీళ్లు అన్ని ఇగిరి సేమ్యా ఉడికాక ఇంక గాస్ కట్టేయ్యాలి.
వేడి వేడి సేమ్యా ఉప్మా రెడీ.....
వంకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:
వంకాయలు : రెండు
ఆవాలు: ఒక స్పూను
మెంతులు: అర స్పూను
మినపప్పు : ఒక స్పూను
పచ్చిమిర్చి : మూడు
ఎండుమిర్చి : రెండు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత
చింతపండు: కొంచెం
పంచదార: ఒక స్పూను
ఉల్లిపాయలు: ఒకటి ( పెద్దది ) ( ఆప్షనల్ )
తయారు చేసే విధానం :
ముందుగా వంకాయకు కొద్దిగా నూనె రాసి గ్యాసు మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. పైన తొక్క అంతా నల్లగా అయ్యేవరకు.
తరువాత దాన్ని చల్లార్చి పైన పొట్టు అంతా తీసెయ్యాలి. నీళ్ళలో చెయ్యితడుపుకుంటూ పొట్టు తీస్తే బాగా వస్తుంది. తరువాత పొట్టు తీసిన వంకాయని చిదిమేయ్యాలి.
ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. గ్యాసు మీద బాణీ పెట్టి అందులో ఒకస్పూను నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించి , గ్యాసు మీద నుండి దించేసి, చల్లార నివ్వాలి.
ఇప్పుడు గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఒక స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసి పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారాక మిక్సీలో వేసి కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం పంచదార వేసి గ్రైండ్ చెయ్యాలి. చివరిలో చిదిమిన వంకాయ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చెయ్యాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలో వేయించిన ఉల్లిపాయలుకలుపుకోవాలి. వంకాయ పచ్చడి రెడీ....ఈ పచ్చడి తాజా తెల్ల వంకాయలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ...
దబ్బకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:
దబ్బకాయ: ఒకటి
ఆవాలు: రెండు స్పూన్లు
మెంతులు : రెండు స్పూన్లు
ఎండుమిర్చి: ఇరవై
బెల్లం : యాభై గ్రాములు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేసే విధానము:
ముందుగా దబ్బకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.
తరువాత గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఈ దబ్బకాయ ముక్కలను వేసి అవి మునిగేలాగా నీళ్ళుపొయ్యాలి. ముక్కలు మెత్త పడి దెగ్గర పడే వరకు ఉంచాలి. దెగ్గర పడ్డాక అందులో తరిగిన బెల్లంవెయ్యాలి. రెండు కలిసి దెగ్గర పడ్డాకా దింపెయ్యాలి. ఈ ముక్కలను చల్లారనివ్వాలి.
ఒక బాణిలో ఒక స్పూను నూనె పోసి అందులో ఆవాలు, మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి ఒకదాని తరువాత ఒకటి వేయించుకోవాలి. ఇంగువ కూడా వెయ్యాలి.
తరువాత వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలలో ఈ పొడిని( ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ) కలిపి ఉప్పు కూడా కలుపుకోవాలి.
దబ్బకాయ పచ్చడి తయారు....
టమాటా పచ్చడి

కావలసిన పదార్ధాలు:
టమాటాలు : అర కిలో
చింతపండు: యాభై గ్రాములు ( ఒక దబ్బకాయి అంత )
ఆవాలు : రెండు స్పూన్లు
మెంతులు: రెండు స్పూన్లు
ఎండుకారం: రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
ఉప్పు : రుచికి తగినంత
ఇంగువ : ఒక స్పూను
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానము:
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.
తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఈ ముక్కలకి చింతపండు కలుపుకోవాలి. చింత పండులో గింజలు లేకుండా చూసుకోవాలి. ఇలా చింతపండు కలిపిన ముక్కలను ఒక గంట పాటు పక్కకు పెట్టుకొని ఊరనివ్వాలి.
ఈలోపు గ్యాసు మీదా ఒక బాణీ పెట్టి అందులో అర స్పూను నూనె వేసి అందులో ఆవాలు మరియు మెంతులు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి. వాటిని చల్లారనిచ్చి రెండూ కలిపి మిక్సీ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
గ్యాసు మీద మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో రెండూ టేబుల్ స్పూన్ల నూనె పోసి బాగా కాగనివ్వాలి. అందులో ఇంగువ వేసి దిన్చేసుకోవాలి. ఈ ఇంగువ నూనెను బాగా చల్లార నివ్వాలి.
గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఊరిన టమాటా ముక్కలను వేసి బాగా దెగ్గర పడే దాక కలుపుతూ ఉండాలి. తరువాత దించేసి ఆ మిశ్రమాన్ని బాగా చల్లార నివ్వాలి.
చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ లో వేసి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టుకి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కలపాలి. ఇంకా ఎండుకారం, ఉప్పు మరియు ఇంగువ నూనె కూడా కలుపుకోవాలి.
అంతే టమాటా పచ్చడి రెడీ....
అరిసెలు

కావలసిన పదార్ధాలు :
బియ్యం : అర కిలో
బెల్లం : పావు కిలో
నూనె : అరిసెలు వేయించుకోటానికి
నువ్వులు: యాభై గ్రాములు
తయారు చేసే విధానము:
అరిసెలు చెయ్యడానికి ఒక రోజు ముందు రాత్రి బియ్యం నాన బెట్టుకోవాలి. మరుసటి రోజు అరిసెలు చేసుకొనే ముందు బియ్యం లో నీరు అంతా తీసేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి.

నీరు అంతా పోయేవరకు ఉంచాలి , కాని బియ్యం మాత్రం కొంచెం తడిగానే ఉండాలి. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకొని తరువాత జల్లించు కోవాలి.

జల్లించిన పిండి ఆరిపోకుండా పిండి అంతా ఒక దెగ్గరకు తీసి నొక్కుతూ ఉండాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అది మునిగే వరకు నీరు పోసి గాస్ మీద పెట్టాలి. ఒక ప్లేట్ లో నీరు పోసుకొని పక్కన పెట్టుకుంటే పాకం వచ్చిందో లేదో అందులో వేసి చూసుకోవచ్చు.

బెల్లం పాకం దెగ్గర పడుతుంటే కొంచెం పాకం తీసి మనం పెట్టు కున్న ప్లేట్ లో వేసి చూసుకోవాలి అది ఉండ చేసే లాగా దగ్గరకి వస్తుంటే గాస్ కట్టెయ్యవచ్చు. అరిసెలు గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి. అంటే పళ్ళెం లో పాకం వేస్తే ఉండ అయ్యి ప్లేట్ కేసి కొడితే టంగు మని చప్పుడు రావాలి.
ఇప్పుడు పాకం లో ఇందాకా మనం ఆడి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం గా వేస్తూ బాగా కలుపుకోవాలి. అది కొంచెం జారుగా వచ్చేదాకా పిండి కలుపుకోవాలి.
ఇప్పుడ గాస్ మీద ఒక బాణీ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. ఒక ప్లాస్టిక్ పేపర్ కాని అరటి ఆకు కానీ తీసుకొని , దానికి కొంచెం నూనె రాసి , కొంచెం పిండి తీసుకొని గుండ్రంగా చేత్తో మనకు కావలసిన అంత సైజులో అరిసేను వత్తుకోవాలి.

కావాలనుకున్న వాళ్లు ఒక ప్లేట్ లో తెల్ల నువ్వులు వేసుకొని ఇప్పుడు వత్తు కున్న అరిసేను ఆ నువ్వులలో దోర్లిన్చుకోవచ్చు. లేక పోతే పాకం లో పిండి కలిపే ముందే అందులో నువ్వులు కలిపేసుకోవచ్చు.

ఇప్పుడు వాటిని నూనెలో వేయించు కోవాలి. తరువాత వాటికి ఉన్న నూనెను అంతా తీసేయ్యటానికి ఒక పరికరం ఉంటుంది.

దాంట్లో పెట్టి నొక్కితే ఎక్కువ ఉన్న నూనె అంతా పోతుంది.

ఆ పరికరం లేక పోయినా రెండు గరిటెల మద్యలో పెట్టి అయిన గట్టిగా నొక్కుకోవచ్చు. అంతే ఎంతో నోరూరించే అరిసెలు రెడీ
పండు మిరపకాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు :
పండు మిరపకాయలు : అర కిలో
మెంతులు : ఒక టేబుల్ స్పూను
చింతపండు : ఒక నిమ్మకాయ అంత
ఉప్పు : రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
బెల్లం : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : అర స్పూను
తయారు చేసే విధానం :
ముందుగా మిరపకాయల ముచికెలు తీసి శుభ్రం చేసుకొని తడి పోయేవరకు ఎండలో పెట్టుకోవాలి.
తరువాత మిరపకాయలను మిక్సీలో వేసి చెక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దానికి చింతపండు కలుపుకోవాలి ( చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి ) .
ఈ మిశ్రమాన్ని రెండు రోజులు మూతపెట్టి ఊరనివ్వాలి. తరువాత మళ్లీ మిక్సీలో వేసి ఈసారి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెంతులు తీసుకొని ఒక బాణిలో వేసి బాగా వేయించుకోవాలి. వాటిని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా.
ఇప్పుడు ఆ మెంతి పొడిని, బెల్లాన్ని మరియు సరిపడా ఉప్పుని మిరపకాయల పేస్టు లో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం వద్దనుకున్నవాళ్ళు వేసుకోవడం మనేయ్య వచ్చు. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని పొయ్య మీద పెట్టి నూనె పోసుకోవాలి. బాగా కాగాక అందులో ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు గాస్ ఆపు చేసి నూనె బాగా చల్లారాక పచ్చడిలో పోసి కలుపుకోవాలి.
పండు మిరపకాయ పచ్చడి రెడీ......పచ్చడి చూడటానికి అంత ఎర్రగా ఉన్నా రుచి మాత్రం చాల కమ్మగా ఉంటుంది సుమా..... ..
పరోటా

కావలసిన పదార్ధాలు :
మైదా - అర కిలో
ఉప్పు - రుచికి తగినంత
పంచదార - అర స్పూను
నెయ్యి లేదా నూనె( పిండి కలుపుకోడానికి) - ఆరు ఏడు స్పూన్లు
నూనె లేదా నెయ్యి - పరోటా కాల్చుకోడానికి
తయారు చేసే విధానము :
ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలో ఉప్పు మరియు పంచదార కలుపుకోవాలి. రెండు మూడు స్పూన్ల నెయ్యి లేదా నూనె వెయ్యాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.తరువాత కూడా నాలుగు ఐదు స్పూన్ల నూనె వేసి , ఒక గంట పాటు ఒక తడి గుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మళ్లీ బాగా కలుపుకోవాలి .
మైదా - అర కిలో
ఉప్పు - రుచికి తగినంత
పంచదార - అర స్పూను
నెయ్యి లేదా నూనె( పిండి కలుపుకోడానికి) - ఆరు ఏడు స్పూన్లు
నూనె లేదా నెయ్యి - పరోటా కాల్చుకోడానికి
తయారు చేసే విధానము :
ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలో ఉప్పు మరియు పంచదార కలుపుకోవాలి. రెండు మూడు స్పూన్ల నెయ్యి లేదా నూనె వెయ్యాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.తరువాత కూడా నాలుగు ఐదు స్పూన్ల నూనె వేసి , ఒక గంట పాటు ఒక తడి గుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మళ్లీ బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండ తీసుకొని దానిని సన్నగా పొడుగ్గా తాడులాగా చేసుకోవాలి. తరువాత దాన్ని గుండ్రంగా చుట్టుకోవాలి.
లేదా ఒక ఉండను తీసుకొని దానిని గుండ్రంగా వత్తుకోవాలి. ఇప్పుడు దానిని చీర కుచ్చుళ్ళు పెట్టినట్టు పెట్టుకోవాలి. అలా పెట్టిన వాటిని మళ్లీ గుండ్రంగా చుట్టాలి.
ఇప్పుడు పిండి వెయ్యకుండా రొట్టెల పీట మీద నూనె వేసి కొంచెం మందంగా పరోటాని వత్తుకోవాలి.
అలా మిగిలిన ఉండలు కుడా వత్తుకోవాలి. తరువాత పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి కాల్చుకోవాలి.
అంతే పరోటాలు రెడీ ......వాటిని మీకు ఇష్టం అయిన కూరతో లాగించేయ్యటమే......
జీరా రైస్ -- దాల్ ఫ్రై

కావలసిన పదార్ధాలు:
జీరా రైస్ :
అన్నము - అర కిలో
జీలకర్ర - మూడు టీ స్పూన్లుపచ్చి మిర్చి - మూడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - ఐదు ఆరు టీ స్పూన్లు
జీడి పప్పు మరియు బఠాణీ - రుచికి కావాలనుకుంటే వేసుకోవచ్చు
దాల్ ఫ్రై :
పెసరపప్పు - వంద గ్రాములు
పచ్చిమిర్చి - రెండు
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి - రెండు
జీలకర్ర పొడి - ఒక టీ స్పూను
ధనియాల పొడి - ఒక టీ స్పూను
కరివేపాకు - ఒక రెబ్బ
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
పోపు సామాను

తయారు చేసే విధానము :
జీర రైస్ :
ముందుగా అన్నం వండుకొని చల్లార బెట్టాలి. ఒక బాణీ తీసుకొని అందులో ఐదు లేక ఆరు టీ స్పూన్ల నూనె గానినెయ్యి గాని వేసి కాగ నివ్వాలి. అందులో మూడు టీ స్పూన్ల జీలకర్ర వేసి వేగ నివ్వాలి.
తరువాత తరిగిన పచ్చి మిర్చి వేసి వేగ నివ్వాలి.

రుచికి కావాలి అనుకుంటే జీడి పప్పు మరియు ఉడికించిన బఠాణీ వేసుకోవచ్చు .

వాటిని కూడా వేగనిచ్చి , ఇప్పుడు అన్నం అందులో వేసుకోవాలి.

అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క నిమిషం గ్యాసు మీద ఉండనిచ్చిదిన్చేసుకోడమే. చూసారా జీర రైస్ చెయ్యడం చాల సులువు కదా.....

బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ - మంచూరియా

కావలసిన పదార్ధాలు :
ఫ్రైడ్ రైస్ కొరకు :
అన్నం - అర కిలో
క్యారెట్ - రెండు
బీన్సు - వంద గ్రాములు
ఉల్లి కోళ్ళు ( స్ప్రింగ్ ఆనియన్స్ ) - వంద గ్రాములు
బేబీ కార్న్ - వంద గ్రాములు
కాబేజీ - వంద గ్రాములు
సోయ్ సాస్ - అర టీ స్పూను
చిల్లి సాస్ - రెండు టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
వెనిగర్ - ఒక టీ స్పూన్
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
మంచూరియా కొరకు :
క్యారెట్ - వంద గ్రాములు
బీన్సు - వంద గ్రాములు
కాబేజీ - వంద గ్రాములు
ఉల్లి కోళ్ళు - వంద గ్రాములు
చిల్లి సాస్ - నాలుగు టీ స్పూన్లు
సోయ్ సాస్ - రెండు టీ స్పూన్లు
టమాటా సాస్ - మూడు టేబుల్ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
నూనె - వేయిన్చు కోడానికి తగినంత
వెల్లుల్లి - మూడు (చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి)
కార్న్ ఫ్లౌర్ - మూడు స్పూన్లు సుమారు
మైదా - నాలుగు లేదా ఐదు స్పూన్లు సుమారు

తయారు చేసే విధానము:
ఫ్రైడ్ రైస్ :
ముందుగా అన్నము వండుకొని బాగా చల్లార బెట్టాలి. మెతుకులు విడి విడిగా వచ్చేలాగా అన్నము వండుకోవాలి. వండిన అన్నములో రెండు స్పూన్లు నూనె వేసి చల్లార బెట్టుకుంటే మెతుకులు విడి విడిగా వస్తాయి.క్యారెట్, బీన్సు, కాబేజీ, బేబీ కార్న్ మరియు ఉల్లి కోళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఒక బాణీ తీసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. తరువాత అందులో క్యారెట్, బేబీ కార్న్ మరియు బీన్సు వేసుకొని వాటిని వేగనివ్వాలి.

తరువాత ఉల్లి కోళ్ళు వేసుకోవాలి. ఒక్కసారి వేగనివ్వాలి. ఇప్పుడు చల్లారిన అన్నం అందులో వెయ్యాలి. అన్నం అన్ని కూరలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి .

అందులో చిల్లి సాస్ , సోయ్ సాస్, అజినమోటో , ఉప్పు మరియు వెనిగర్ వెయ్యాలి.

అన్ని బాగా కలుపుకోవాలి. ఒక ఐదు నిముషాలు గాస్ మీదే ఉంచి దిన్చేసుకోవాలి.
మంచూరియా తయారు చేసే విధానం :
క్యారెట్, బీన్సు, కాబేజీ మరియు ఉల్లి కోళ్ళను బాగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కలను పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ముక్కలను అన్నిటిని కలిపి ఒక బౌల్ లో వేసుకోవాలి. అందులో రెండు స్పూన్ల చిల్లి సాస్, ఒక స్పూన్ సోయ్ సాస్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో మైదా పిండి ఇంకా కార్న్ ఫ్లౌర్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు అవ్వడానికి వీలుగా ఉండేలాగా తయారు చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బాణిలో మంచూరియా వేగడానికి సరిపోయే నూనెను పోసి గాస్ మీద పెట్టి కాగ నివ్వాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేయించిన మంచూరియాను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణిలో రెండు స్పూన్ల నూనె పోసి అందులో తరిగి ఉంచుకున్న వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. తరువాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న కూరగాయల ముక్కలను నూనెలో వెయ్యాలి. బాగా వేగనివ్వాలి. తరువాత అందులో మూడు టేబులు స్పూన్ల టమాటా సాస్, రెండు టీ స్పూన్ల చిల్లి సాస్, ఒక టీ స్పూన్ సోయ్ సాస్ , చిటికెడు అజినమోటో, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీరు పోసి బాగా ఉడక నివ్వాలి.

దెగ్గర పడటానికి ఒక స్పూను కార్న్ ఫ్లౌర్ కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ మిశ్రమాన్ని పైన ఉడుకుతున్న దాంట్లో పొయ్యాలి. బాగా కలపాలి. దెగ్గర పడ్డాక అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న మంచూరియాలను అందులో కలపాలి.

మూడు నిమిషాలు ఉడకనిచ్చి పైన ఉల్లి కోళ్ళు ముక్కలు చల్లాలి. స్టవ్ అపుచేసుకోవాలి. అంతే మంచూరియా తయారు......
చైనీస్ హొటలులో చేసినంత రుచిగా తయారు అవుతుంది మీ ఫ్రైడ్ రైస్ మరియూ మంచూరియా ....అదీ ఇంట్లోనే ....ఇంక ఎందుకు ఆలస్యం ....మొదలెట్టండి మరి....














